జీవితం శాశ్వతం కాదని చెబుతుండగానే.. భారీ శిలువ విరిగిపడి చర్చి ఫాదర్ మృతి 

జీవితం శాశ్వతం కాదని చెబుతుండగానే.. భారీ శిలువ విరిగిపడి చర్చి ఫాదర్ మృతి 

కొన్ని సార్లు మనం ఎవరిగురించైనా మాట్లాడుకున్న వెంటనే వారు కనిపించడం లేదా ఫోన్ చేయడం వంటి యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతుంటాయి. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఏదో అద్భుతం జరిగినట్లు అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు విషాదకరంగా మారితే.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఈక్వెడార్ లోని ఓ చర్చిలో జరిగింది.  ప్రార్థనల సమయంలో ఓ చర్చి ఫాదర్ మరణం గురించి మాట్లాడిన వెంటనే జరిగిన సంఘటన అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

జీవితం శాశ్వతం కాదని చెబుతున్న మాటలు.. ఆ మాటలు చెబుతున్న వ్యక్తి జీవితంలోనే నిజమవడం.. వినడానికి నమ్మశక్యం కానప్పటికీ, ఈక్వెడార్‌లో జరిగిన విషాద ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరణం గురించి ప్రసంగించిన కొద్ది క్షణాల్లోనే ఓ క్యాథలిక్ చర్చి ఫాదర్ అనూహ్య ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 

ఈక్వెడార్‌లోని గ్వాయాక్విల్ నగరంలో అవర్ లేడీ ఆఫ్ పెర్పెచువల్ హెల్ప్ చర్చిలో చర్చి ఫాదర్ గా పనిచేస్తున్న పాట్రిసియో ఆల్ఫ్రెడో సాంచెజ్ మొలినారి అనే ఫాదర్ .. శనివారం చర్చిలో ప్రార్థనలు సమయంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మనిషి జీవితం శాశ్వతం కాదని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందేనని, ఫోన్లలో సమయాన్ని వృథా చేయకుండా దేవుడితో, కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపాలని సూచించారు. అయితే, ఈ మాటలు చెప్పిన కొద్దిసేపటికే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. 

భక్తులను ఆశీర్వదిస్తూ ప్రార్థన ప్రారంభించగానే, వెనుక గోడకు వేలాడుతున్న భారీ శిలువ ఒక్కసారిగా ఊడిపడి చర్చి ఫాదర్ తల వెనుక భాగంపై పడింది. ఈ ఘటన చర్చి సిసీ కెమెరాల్లో రికార్డైంది. శిలువ పడిన వెంటనే భక్తులు అంబులెన్స్‌ను రప్పించి ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.

చర్చి ఫాదర్ మరణాన్ని గ్వాయాక్విల్ ఆర్చిడియోసెస్ ధ్రువీకరించింది. అయితే, భారీ శిలువ గోడ నుంచి ఎందుకు ఊడిపడిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

జీవితం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు అనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచింది. మరణం గురించి మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే అదే ఆయన జీవితంలో విషాదంగా నిజం కావడం యాదృచ్ఛికమైనా.. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. అయితే, ఇది కేవలం ఓ దురదృష్టకర ప్రమాదమే తప్ప.. ఈ రెండింటి మధ్య ఏదైనా అతీంద్రియ సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. ఏ క్షణం మనకు చివరిదవుతుందో తెలియని జీవితంలో.. మనవారి కోసం సమయం కేటాయిస్తూ, ప్రతి క్షణాన్ని విలువైనదిగా మలుచుకోవాలనే సందేశాన్ని ఈ విషాద ఘటన గుర్తుచేస్తోంది.